ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. కరోనా టీకా తీసుకున్న రెండు రోజులకు ఓ గ్రామ వాలంటీర్ మృతి చెందింది. దీంతో కరోనా టీకా తీసుకోవడానికి భయపడుతున్న ప్రజలకు మరింత బలం చేకూరింది. అయితే ఆమె మృతికి కరోనా వ్యాక్సిన్ కారణమా? లేక ఇతర ఆరోగ్య సమస్యలా? అనేది తెలియాల్సి ఉంది. శ్రీకాకుళం డీఎంహెచ్‌వో కేసీ చంద్ర కథనం ప్రకారం.. రేంటికుంట గ్రామానికి చెందిన వాలంటీర్ పి.లలిత(29)కు ఫిబ్రవరి 5న కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని.. అప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందన్నారు. ఆమెకు ఎలాంటి జ్వరం, ఇతర లక్షణాలు బయటపడలేదన్నారు. శనివారం రాత్రి వరకు ఆమె ఆరోగ్యంగానే ఉన్నా ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందింది. ఆమె మృతి చెందినట్లు ఉదయం 4 గంటలకు కుటుంబ సభ్యులకు తెలిసింది. లలిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస కమ్యూనిటీ హెల్త్‌కేర్ సెంటర్‌కు తరలించామని డా.కేసీ చంద్ర తెలిపారు. లలిత మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి కానున్నాయి.