Breaking News

‘విశాఖ ఉక్కు’ ఇక ప్రభుత్వానికి కాదు

0 0

విశాఖలోని స్టీల్ ప్లాంట్‌ను 100 శాతం ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే బుధవారం ట్వీట్‌ చేశారు. జనవరి 27న జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు పేర్కొన్నారు. ఈ సంస్థపై యాజమాన్య హక్కులను వదులుకొని పూర్తిగా ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. ప్రైవేటీకరణ ద్వారా యాజమాన్య హక్కులతో పాటు, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (RINL)లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 100 శాతం షేర్‌హోల్డింగ్‌ను ఉపసంహరించుకోవడానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ జనవరి 27న ఆమోదముద్ర వేసిందని వెల్లడించారు.

‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అన్న ఉద్ధృత పోరాటం ఫలితంగా 1971లో శంకుస్థాపన చేసుకున్న ఈ నవరత్న సంస్థలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికే 100% వాటాలున్నాయి. సముద్రతీరంలో ఏర్పాటైన తొలి సమీకృత ఉక్కు కర్మాగారం ఇదే. ఒకప్పుడు భారీ నష్టాల్లో కూరుకుపోయిన సంస్థ.. తర్వాతి కాలంలో తేరుకొని రూ. 21,851 కోట్ల టర్నోవరు సాధించే స్థాయికి చేరింది. నాలుగేళ్లలో 203.6% వృద్ధి సాధించింది. 2010 నవంబరు 17న దీనికి నవరత్న హోదా కల్పించారు. దేశంలో అతిపెద్ద సింగిల్‌ సైట్‌ ప్లాంట్ ఇదే.