దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కొన్ని లక్షల మంది జీవితాలు లోకల్ రైళ్లతో ముడిపడి ఉన్నాయి. అక్కడ ఎంతోమందికి లోకల్ రైళ్లు జీవనాధారంగా మారాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వల్ల 11 నెలలుగా లోకల్ రైళ్లు ప్రజలకు దూరమయ్యాయి. గత ఏడాది మార్చిలో ఆగిపోయిన లోకల్ రైళ్లు.. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి మళ్లీ సాధారణ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. లోకల్ రైలుకు ముంబై ప్రజలు తమ జీవితాలలో ఎలాంటి స్థానం ఇస్తారో కళ్లకు కట్టే ఫొటో ఇది. చాలా నెలల తర్వాత కళ్ల ముందు ప్రత్యక్షమైన లోకల్ రైలును చూసి ఓ ప్రయాణికుడి మనసు ఉప్పొంగిపోయింది. వెంటనే దాని ముందు మోకరిల్లి దండం పెట్టాడు. దీంతో లోకల్ రైలు అనేది కేవలం ఒక ప్రయాణ సాధనం కాదు.. ఓ భావోద్వేగం అని ఆనంద్ మహింద్రా సహా పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొంతమంది ‘బాబోయ్.. ఇదేం భక్తి’ అని, ‘ఇదో పబ్లిసిటీ స్టంట్’ అని అన్నవాళ్లు కూడా లేకపోలేదు.