Breaking News

మీకు ‘మహానంది’ క్షేత్రం గురించి తెలుసా?

0 0

కర్నూలు జిల్లా నంద్యాలకు 14 కి.మీ. దూరంలో ఉండే మహానంది క్షేత్రానికి పురాతన చరిత్ర ఉంది. 7వ శతాబ్దంలో ఇక్కడ మహానందీశ్వరుడి ఆలయం నిర్మించారు. ఈ క్షేత్రంలో శివలింగం కొంచెం చొట్టబడినట్లు ఉంటుంది. దీనికి వెనుక కథ ఏంటంటే.. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవును కొట్టగా పుట్టలో గల స్వామిని ఆవు తొక్కడంతో లింగం కొంచెం అణిగి ఉంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగంపై వుంటుంది. అటు శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే నీరు జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత. ఈ ఆలయంలో గల పుష్కరిణిలు విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనాన్ని తెలియచేస్తాయి. పుష్కరిణిలో నుంచి వచ్చిన నీరు ఆలయ గోపురం ముందు ఉన్న రెండు గుండాల ద్వారా బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరు ఉన్నట్లే మనకు తెలియదు. పుష్కరిణిలో వచ్చే నీటితో సుమారు 3 వేల ఎకరాలు పండుతుందని ఇక్కడి పురాణాలు చెప్తున్నాయి. 2019లో ఇక్కడి గుండాలలో నీరు బ్లాక్ అయ్యి బయటకు వెళ్లకపోవడంతో ఆలయం మునిగిపోయింది. దీంతో చాలారోజుల పాటు ఆలయాన్ని మూసివేశారు. ఆ నీరు బయటకు వెళ్లాక మళ్లీ ఆలయాన్ని తెరిచారు. కాగా కార్తీక మాసంలో సోమవారం రోజు నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందులను దర్శించుకుంటే జన్న జన్మల నుంచి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలు పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి.