ఆస్ట్రేలియా హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్‌తో పలువురు ఆటగాళ్లకు విభేదాలు ఏర్పడ్డాయి. కోచ్ వ్యవహారశైలితో ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారని, జట్టుతో లాంగర్ సరిగా వ్యవహరించడం లేదని ఆసీస్ మీడియానే బహిర్గతం చేసింది. కొందరు సీనియర్ ఆటగాళ్లు కూడా లాంగర్ పట్ల అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చింది. ఇటీవల గబ్బా టెస్టులో ఓ ఆసీస్ ఆటగాడు మైదానంలో తినేందుకు జేబులో సాండ్‌విచ్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని, దాంతో అతడిని అలా చేయవద్దని లాంగర్ చెప్పాడట. గత అనుభవాల దృష్ట్యా ఆస్ట్రేలియా ఆటగాళ్లపై నిరంతరం కెమెరాల నిఘా ఉంటుందని, జేబులో ఏదైనా ఉంటే అది ప్రజల్లోకి వేరే విధంగా వెళ్లే ప్రమాదం ఉన్నట్లు అతడికి వివరించానని ఆసీస్ కోచ్ తెలిపాడు. దీన్ని ఎలా సమర్థించుకుంటావని ఆ ఆటగాడిని నిలదీసినట్లు లాంగర్ స్పష్టం చేశాడు. టీమ్‌ఇండియాతో టెస్టు సిరీస్ కోల్పోయాక ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా వివాదం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి. ఈ విభేదాలను ఆటగాళ్లు జట్టు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లలేదని సదరు మీడియా కథనంలో పేర్కొంది.
