కర్నూలు జిల్లా బనగానపల్లి మండలంలో ఉన్న యాగంటి దక్షిణాదిలో ఉన్న పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అగస్త్య మహర్షి, వీరబ్రహ్మేంద్రస్వామి వంటివారి పేర్లతో ఇక్కడి చారిత్రక, పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి. ఇక్కడి ఉమా మహేశ్వర ఆలయంలోని ముఖమండపంలో నందీశ్వరుడు కొలువై ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. సుమారు 90 ఏళ్ల క్రితం నాలుగు స్తంభాల లోపల నందీశ్వరుడి చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసేవారు. కానీ నేడు ప్రదక్షిణలు చేయడానికి ఏ మాత్రం అవకాశం లేకుండా నందీశ్వరుడి విగ్రహం అంతకంతకూ పెరుగుతూ పోతోంది. కలియుగం అంతమయ్యే నాటికి నంది లేచి రంకె వేస్తుందని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో వర్ణించారు. పురావస్తు అధికారుల లెక్కల ప్రకారం ప్రతి 20 సంవత్సరాలకు అంగుళం పరిమాణంలో నంది పెరుగుతుందని తెలుస్తోంది. అటు అగస్త్యమహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి.
తొలుత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భావించినా తయారైన విగ్రహంలో చిన్న లోపం ఉన్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని, స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వర స్వామిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. లోప భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్దంగా వున్న గుహలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ ఉంటుంది.
యాగంటిలోని ఉమా మహేశ్వర ఆలయం చుట్టూ ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది. కొండల నుంచి జారిపడే నీరు, గుహలు భక్తులను పరవశింపచేస్తాయి. వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న గుహ నుంచి దేవుళ్లు శ్రీశైలం, తిరుపతి వెళ్లడానికి సొరంగ మార్గం ఉంది. కానీ మనుషులు మాత్రం ఈ సొరంగంలోకి ప్రవేశించలేరు. యాగంటిలో చాలా సినిమా షూటింగులు కూడా జరుగుతుంటాయి. జయం మనదేరా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, గమ్యం, నేనే రాజు నేనే మంత్రి, గద్దలకొండ గణేష్ వంటి సినిమాలను ఇక్కడ చిత్రీకరించారు.