పాత రూ.100 నోట్ల విషయంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత రూ.100 నోట్లను మార్చి లేదా ఏప్రిల్‌లో రద్దు చేయాలని ఆర్‌బీఐ భావిస్తున్నట్లు ఆర్‌బీఐ జనరల్ మేనేజర్ మహేష్ తెలిపారు. పాత సిరీస్‌లో ఉన్న నోట్లను మార్చి నాటికి చలామణిలో లేకుండా చేయాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కాగా ఆరేళ్లుగా పాత రూ.100 నోట్లను తాము ముద్రించడంలేదని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో మన దగ్గర ఉన్న పాత నోట్ల పరిస్థితేంటి అన్న డౌట్ ప్రతి ఒక్కరికీ వస్తుంది. ఈ నోట్లను మనం ఎవరికైనా ఇచ్చినప్పుడు అవి అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు బ్యాంకులకు చేరతాయి. అలా చేరిన నోట్లను బ్యాంకులు RBIకి పంపిస్తాయి. ఇక అక్కడి నుంచి RBI వాటి స్థానంలో కొత్త నోట్లను రిలీజ్ చేస్తుంది. అలా పాతనోట్లు రోజురోజుకూ కనుమరుగవుతూ పోతాయి. కొన్నాళ్లకు చూద్దామన్నా కనిపించవు. ఒకప్పుడు రూపాయి, రూ.2 నాణేలు ఇలాగే మాయమయ్యాయి. ఏ కరెన్సీ నోటుకైనా కొంత కాలపరిమితి ఉంటుంది. ఆ తర్వాత అది చిరిగిపోతూ సమస్యగా మారుతుంది. అలాంటి నోట్లను RBI, బ్యాంకులూ రోజూ ఆపేస్తూనే ఉంటాయి. పాత నోట్లతో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. నోట్ల రద్దు తర్వాత ఇప్పటికీ పాత నోట్లు చెలామణీ అవుతూనే ఉన్నాయి. వాటిని ఆపేయడమే మంచిదని RBI భావిస్తోంది.