Breaking News

‘సూపర్ ఓవర్’ మూవీ రివ్యూ

2 0

రేటింగ్: 3.25/5

ఆహా ఓటీటీలో ఈ శుక్రవారం వచ్చిన మరో కొత్త చిత్రం ‘సూపర్ ఓవర్’. నవీన్ చంద్ర, చాందిని చౌదరి, ప్రవీణ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. క్రికెట్ బెట్టింగ్ అంశంపై చాలా తక్కువ బడ్జెట్‌లో ఒక్కరోజులో జరిగే కథను దర్శకుడు చక్కగా తెరకెక్కించాడు. కాగా ఈ మూవీ దర్శకుడు ప్రవీణ్ వర్మ చనిపోయినట్లు చివర టైటిల్ కార్డుల్లో వేశారు.

ఇక కథలోకి వెళ్తే.. కాశీ (నవీన్ చంద్ర) ఆర్థికంగా కష్టాల్లో ఉండేసరికి క్రికెట్ బెట్టింగ్‌పై మోజు పెంచుకుంటాడు. దాంతో క్రికెట్ బుకీలతో సంప్రదించి బెట్టింగ్ వేస్తాడు. దీనికి అతడి ఇద్దరు స్నేహితులు మధు (చాందినీ చౌదరి), వాసు (రాకేందు మౌళి) మద్దతు తెలుపుతారు. అయితే బెట్టింగ్‌లో గెలుచుకున్న డబ్బులను హవాలా రూపంలో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అనంతరం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో సినిమాలో చూడాల్సిందే.

ముఖ్యంగా గంటన్నర కూడా లేని ఈ సినిమా మొత్తం సస్పెన్స్ మెయింటెన్ అవుతుంది. కాశీగా నవీన్ చంద్ర చాలా నేచురల్‌గా నటించాడు. క్రికెట్ బెట్టింగ్‌లో ఉండే లొసుగులను దర్శకుడు క్లారిటీగా చెప్పిన విధానం బాగుంది. ఒక్క రాత్రిలో అది కూడా హైదరాబాద్ రోడ్లపై ఈ కథ జరుగుతుంది. ఈ మూవీకి కథ కంటే కూడా స్క్రీన్‌ప్లే చాలా ప్రధానం. ఎక్కడా బోర్ కొట్టకుండా, లాజిక్కులకు తావు లేకుండా, ప్రేక్షకులు చూపు తిప్పుకోకుండా ఈ సినిమాను చిత్రీకరించాడు. గతంలో వచ్చిన శర్వానంద్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ మూవీ తరహాలో ప్రతి క్యారెక్టర్ వెనుక ఓ కథను దర్శకుడు చూపించాడు. చాందినీచౌదరి, రాకేందు మౌళి, అజయ్ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. వైవా హర్ష, ప్రవీణ్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నీషియన్స్ విషయానికొస్తే దర్శకుడి తర్వాత చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ గురించే. తక్కువ బడ్జెట్ అయినా ఈ సినిమాకు అతడు రిచ్‌నెస్ తీసుకొచ్చాడు. ఇక సంగీత దర్శకుడు సన్నీ ఎం.ఆర్ నేపథ్య సంగీతంతో ఈ సినిమాకు ప్రాణం పోశాడు. మూవీలో పాటలేవీ లేకపోయినా బీజీఎం చాలా బాగా ఇచ్చాడు. మిగతా డిపార్టుమెంట్లు కూడా సినిమా బాగా వచ్చేందుకు సహకారం అందించాయి.

చివరగా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు తప్పనిసరిగా ఈ మూవీని చూసి తీరాల్సిందే. ఏ సీన్ మిస్ అయినా కానీ కథ తెలియక గందరగోళంలో పడే అవకాశముంది కాబట్టి ప్రతి సన్నివేశాన్ని ఫాలో అవ్వండి. ఓటీటీలో మూవీనే కదా అని ఆత్రుతలో ఫాస్ట్ ఫార్వాడ్ మోడ్‌లోకి మాత్రం వెళ్లకండి. ఆహాలో ‘మెయిల్’ తర్వాత మరోసారి ‘సూపర్ ఓవర్’ సినిమాతో ప్రేక్షకులు వినోదాన్ని ఆస్వాదిస్తారు.

A REVIEW WRITTEN BY NVLR