అయోధ్య రామమందిరం నిర్మాణానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూ.30 లక్షలు విరాళం ప్రకటించారు. తిరుపతిలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న పవన్ ఈ మేరకు విరాళంపై ప్రకటన చేశారు. తన కార్యవర్గంలో ఇతర మతాలకు చెందినవారు కూడా రూ.11వేలు అందించారని, దాని డీడీని కూడా అందిస్తున్నానని తెలిపారు. అనంతరం శ్రీరాముడి ప్రాశస్త్యాన్ని పవన్ కళ్యాణ్ వివరించారు. ‘ధర్మానికి ప్రతిరూపమే శ్రీరామచంద్రుడు. సహనం, శాంతి, త్యాగం, శౌర్యం.. ఈ దేశం ఎలాంటి దాడులు, ఒడిదుడుగులు ఎదురైనా మన దేశం బలంగా నిలబడగలిగింది అంటే శ్రీరాముడు చూపిన మార్గమే. పరమత సహనం మనదేశంలో ఉందంటే అది ఆయన చూపిన దారే. అందుకే రామరాజ్యం అన్నారు. అన్ని మతాల వారు, ప్రాణకోటి సుఖంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామాలయం కడుతుంటే భారతీయులంతా పిల్లాపాపలంతా విరాళాలు ఇస్తున్నారు. నా వంతుగా రూ.30 లక్షలు ఇస్తున్నా’ అని పవన్ తెలిపారు.
