Breaking News

సీరం సంస్థలో భారీ అగ్నిప్రమాదం

0 0

పుణెలోని ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టెర్మినల్ 1 గేట్ వద్ద పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. 10 ఫైరింజన్లు మంటలు ఆర్పివేశాయి. ఈ సంస్థ కరోనా వ్యాక్సిన్ టీకాలను తయారు చేస్తుండటంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం పుణెలో 100 ఎకరాలలో విస్తరించి ఉంది. ప్రస్తుతం అగ్నిప్రమాదం జరిగిన ప్లాంట్ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే ఉందని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై స్పందించిన సంస్థ యాజమాన్యం ఈ ప్లాంట్ నిర్మాణ దశలో ఉందని, ఇక్కడ వ్యాక్సిన్ తయారీ జరగడం లేదని వివరణ ఇచ్చింది. కాగా కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా సీరం సంస్థ ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో కొవిషీల్డ్ టీకాలను తయారు చేస్తోంది. కాగా ఈ అగ్నిప్రమాదంలో ఐదుగురు కార్మికులు చనిపోయినట్లు పుణె మేయర్ మురళీధర్ వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న భవంతిలో ఈ ఘటన జరిగిందన్నారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని, వెల్డింగ్ వల్ల మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. కాగా మంటలు ఆర్పిన తర్వాత ఐదు మృతదేహాలను గుర్తించామని ఆయన పేర్కొన్నారు.