అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ కాలం ముగిసింది. ఈ మేరకు ఆయన శ్వేతసౌధాన్ని వీడారు. ఈ సందర్భంగా ఆయన తన వీడ్కోలు సందేశాన్ని విడుదల చేశారు. అయితే చివరి ప్రసంగంలోనూ బైడెన్ గెలుపును ఆయన అంగీకరించలేదు. ‘అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అద్భుతమైన అవకాశాన్నిఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు. ఈ వారం కొత్త పాలకవర్గం విధుల్లోకి రానుంది. అమెరికాను వారు విజయపథంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నా. ఈ ప్రయాణంలో వారికి అదృష్టం కూడా తోడవ్వాలి. క్యాపిటల్ భవనంపై జరిగిన దాడితో అమెరికా వాసులు భయాందోళనకు గురయ్యారు. రాజకీయ హింస చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలను సహించకూడదు. అమెరికా నాయకత్వాన్ని అంతర్జాతీయంగా బలపరిచాం. యావత్ ప్రపంచం అమెరికాను గౌరవిస్తోంది. వివిధ దేశాలతో సంబంధాలను దృఢపరిచాం. గత కొన్ని దశాబ్దాల చరిత్రలో ఎలాంటి యుద్ధాలు ప్రారంభించని తొలి అధ్యక్షుడిగా గర్వపడుతున్నా’ అంటూ ట్రంప్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.