Breaking News

ఆసీస్ గడ్డపై వరుసగా రెండో సిరీస్ విజయం

1 0

సీనియర్ ఆటగాళ్లు లేకున్నా టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై అదరగొట్టింది. బ్రిస్బేన్ టెస్టులో ఆసీస్ విధించిన 328 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి టీమిండియా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ రోహిత్ శర్మ (7) దారుణంగా విఫలమైనా మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (91) అద్భుతంగా పోరాడాడు. అతడికి పుజారా (56) తోడుగా నిలిచాడు. అనంతరం వీరిద్దరూ అవుటైనా పంత్ (89) వీరోచితంగా ఆడాడు. దీంతో మరో మూడు ఓవర్ల ఆట మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించింది. ఈ గెలుపుతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. గత పర్యటనలోనూ టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా వరుసగా రెండోసారి ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ సాధించింది. విరాట్ కోహ్లీ సహా సీనియర్ బౌలర్లు అందుబాటులో లేకపోయినా భారత్ సాధించిన ఈ విజయం అసామాన్యం. గిల్ ఈ మ్యాచ్‌లో సెంచరీ మిస్ అయినా 50 ఏళ్ల గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఓ టెస్ట్ నాలుగో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్నవయసు ఇండియన్ ఓపెనర్‌గా నిలిచాడు. గిల్ ప్రస్తుత వయసు 21 ఏళ్ల 133 రోజులుగా ఉంది. గతంలో ఈ రికార్డు సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. సన్నీ 21 ఏళ్ల 243 రోజుల వయసులో 1970-71లో వెస్టిండీస్‌పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టులోని నాలుగో ఇన్నింగ్సులో హాఫ్ సెంచరీ బాదాడు.