తెలంగాణలోనూ శబరిమల అయ్యప్ప ఆలయాన్ని పోలిన ఆలయం ఉంది. ఇలాంటి గుడిని ఎక్కడంటే యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో నిర్మించారు. కేరళ రాజతాంత్రి కండారువర్ రాజీవ్ తాంత్రి సలహాతో శబరిమల నమూనాలో ఇక్కడ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణానికి పలువురు దాతలతో పాటు మాస్ ప్యాక్ కంపెనీ యజమాని రామవర్మ కూడా సహాయం చేశారు. తెలంగాణలో తొలిసారిగా రూ.కోటి వ్యయంతో ఈ ఆలయంలో స్వర్ణ ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ కొలువుదీరిన అయ్యప్పస్వామిని భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకుంటారు. భక్తులు అయ్యప్ప మాలలు వేసుకున్న సమయంలో ఈ ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కరోనా నేపథ్యంలో అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా మాలధారణ, మాల విరమణకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు శబరిమలలో ఉండే అనుభూతిని పొందుతున్నట్లు వివరిస్తున్నారు.