Breaking News

సంక్రాంతి విజేత ఎవరు?

2 0

టాలీవుడ్‌లో సంక్రాంతికి సినీ సందడి అంటే మాములుగా ఉండదు. అందుకే ఈ పండగకు పెద్ద, చిన్న సినిమాలు సుమారు నాలుగైదు విడుదలవుతాయి. అయితే ఈ సారి 50 శాతం ఆక్యుపెన్సీ కారణంగా పెద్ద హీరోల చిత్రాలు బరిలో లేకపోయినా రవితేజ, రామ్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి మీడియం రేంజ్ హీరోల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటితో పాటు డబ్బింగ్ మూవీ ‘మాస్టర్’ కూడా జత కలిసింది.

ఈ సంక్రాంతికి మొత్తం ఐదు సినిమాలు విడుదలయ్యాయి. క్రాక్, మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్, సైకిల్ వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో మహత్ రాఘవేంద్ర, పునర్నవి భూపాళం నటించిన ‘సైకిల్’ చిత్రం మెట్రో సిటీలలో మాత్రమే విడుదలైంది. అయినా ఈ చిత్రాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ సినిమా గురించి పక్కన బెడితే మిగతా నాలుగు సినిమాలలో ఏది విజేతగా నిలిచిందో చూద్దాం.

ముగ్గుల పండక్కి విడుదలైన తొలి చిత్రం రవితేజ ‘క్రాక్’. తొలిరోజు కొన్ని కారణాల వల్ల మూడు షోలు రద్దయినా పడింది ఒక్క షోనే అయినా ఈ మూవీ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. రవితేజ నటన, మాస్ ఎలివేషన్స్, ఫైట్లు, పాటల కారణంగా ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతోంది. యావరేజ్ రేటింగ్ కూడా 2.75 సంపాదించింది. ఇక మాస్టర్ డబ్బింగ్ సినిమానే అయినా తొలిరోజు వసూళ్లు బాగానే రాబట్టింది. కానీ రొటీన్ మాస్ సినిమా అనే టాక్ వచ్చేసరికి ఆ తర్వాత కలెక్షన్లు నెమ్మదించాయి. రామ్ ‘రెడ్’ కూడా అనుకున్నంత టాక్ తెచ్చుకోలేదు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ మూవీ ఓటీటీలకు ఎక్కువ అని సినీ ప్రియులు మాట్లాడుకుంటున్నారు. ఇక ‘అల్లుడు అదుర్స్’ సంగతి సరేసరి. అనుకోకుండా ఈ పండక్కి పోటీలోకి వచ్చిన ఈ సినిమా పరమ రొటీన్ కామెడీ అని టాక్ తెచ్చుకుంది. కందిరీగ ఫార్ములాను అటు తిప్పి ఇటు తిప్పి ప్రేక్షకుల మీదకు సంతోష్ శ్రీనివాస్ వదిలాడనే రిమార్క్ సంపాదించుకోవడంతో నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో కలెక్షన్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ వీకెండ్ దాటితే కానీ ఈ సినిమా పరిస్థితిపై అంచనా వేయలేం.

ఈ నాలుగు సినిమాల్లో సంక్రాంతి హిట్ నిస్సందేహంగా ‘క్రాక్’ సినిమానే. తొలి ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సంపాదించిన ఈ మూవీకి ఆరో రోజు నుంచి వచ్చే కలెక్షన్లు అన్నీ లాభాలే. 50 శాతం ఆక్యుపెన్సీతో తొలి 5 రోజుల్లోనే లాభాల్లోకి వెళ్లిన ఈ సినిమా రేంజ్ గురించి ఇంకా చెప్పేదేముంది. రవితేజకు ‘రాజా ది గ్రేట్’ తర్వాత నిఖార్సైన హిట్ ఇదే. మొత్తానికి కరోనాకు కూడా ‘క్రాక్’ పుట్టించిన సినిమా ఇది. మాస్ మహారాజ్ రవితేజ తర్వాత గోపీచంద్ మలినేని, తమన్ ఈ సినిమా విజయంలో కీలకపాత్ర వహించారు.

-->