Breaking News

నాలుగు టెస్టులు ఆడింది ఇద్దరు భారత ఆటగాళ్లే

1 0

ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడతున్న టెస్ట్ సిరీస్‌లో మొత్తం నాలుగు టెస్టులు ఉన్నాయి. ప్రస్తుతం నాలుగో టెస్టు జరుగుతోంది. అయితే ఈ నాలుగు టెస్టుల్లో మొత్తం 20 మంది ఆటగాళ్లను టీమిండియా బరిలోకి దించడం గమనార్హం. సుమారు 60 ఏళ్ల తర్వాత భారత్ ఓ సిరీస్‌లో 20 మంది ఆటగాళ్లను ఆడించింది. పలువురు ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో ప్రతి టెస్టుకు తుదిజట్టులో కొత్త ఆటగాళ్లకు స్థానం కల్పించింది. చివరిగా 1961-62 సీజన్‌లో భారత్ 20 మంది ఆటగాళ్లతో ఆడింది. కాగా 1959 ఇంగ్లండ్ పర్యటనలో, 2014-15 ఆసీస్ పర్యటనలో, 2018 ఇంగ్లండ్ పర్యటనలో భారత్ 17 మందిని ఆడించింది.

అయితే ఇక్కడ మరో విషయం ఉంది. ప్రస్తుత టెస్టు సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడిన ఆటగాళ్లు ఎంతమందో తెలుసా? కేవలం ఇద్దరే ఇద్దరు. వారే పుజారా, రహానె. తొలి టెస్టులో ఆడిన పృథ్వీ షా, సాహా వారి చెత్త ఆటతో జట్టులో స్థానం కోల్పోగా కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల భారత్ వచ్చేశాడు.
ఇక షమీ గాయపడి మిగతా సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా జట్టులోకి వచ్చారు. రెండో టెస్టులో ఉమేష్ యాదవ్ గాయపడి మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అదీకాక మయాంక్ చెత్త ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు వారి స్థానాల్లో నవదీప్ సైనీ, రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చారు. ఇక మూడో టెస్టులో గాయాలపాలైన వారి జాబితా పెద్దదిగానే ఉంది. విహారి, అశ్విన్, జడేజా, బుమ్రా వరుసగా గాయపడ్డారు. దీంతో నాలుగో టెస్టుకు వీరి స్థానంలో మయాంక్, సుందర్, శార్దూల్ ఠాకూర్, నటరాజన్ జట్టులోకి వచ్చారు.

మొత్తంగా తొలి టెస్టు నుంచి నాలుగో టెస్టు వరకు కేవలం ఇద్దరే ఆటగాళ్లు జట్టులో కొనసాగడం గమనార్హం. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టులో మాత్రం లబుషేన్, స్మిత్, వేడ్, పైన్, గ్రీన్, స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్, లయోన్.. ఇలా 9 మంది నాలుగు టెస్టులు ఆడేశారు. బర్న్స్, పుకోస్కీ, ట్రావిస్ హెడ్, వార్నర్ మాత్రం ఒకట్రెండు మ్యాచ్‌లు ఆడారు.

-->