Breaking News

రామ్ ‘రెడ్’ మూవీ రివ్యూ

2 0

RAM RED MOVIE REVIEW: THRILLER BUT NOT ENGAGING

రేటింగ్: 2.75/5

ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటించిన సినిమా ‘రెడ్’. రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీలో అందరూ అతడి నటనే గురించే మాట్లాడతారు. ముఖ్యంగా ఈ సినిమాను వన్‌మ్యాన్ షోగా మార్చేశాడు. తమిళ రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ స్క్రీన్‌ప్లేపై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేది.

ఇక కథలోకి వెళ్తే.. రామ్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. సిద్ధార్థ్‌ పాత్రలో ఇంజినీర్‌గా, ఆదిత్య పాత్రలో ఆవారాగా నటించాడు. వీరిద్దరూ కవలలు. అయితే ఆకాష్ అనే వ్యక్తి మర్డర్ కేసులో సిద్ధార్థ్ అరెస్ట్ అవుతాడు. ఇదే కేసులో ఆదిత్య పాత్ర కూడా ఉందని తేలుతుంది. ఇంతకీ ఆకాష్‌ను ఎవరు, ఎందుకు మర్డర్ చేశారన్నదే మిగతా కథ.

ఆదిత్య, సిద్ధార్థ్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్‌లతో ఫస్టాఫ్‌ ఏదో సోసోగా సాగగా సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్‌లో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాను ఇంట్రెస్టింగ్‌గా మార్చింది. అయితే సెకండాఫ్ మొత్తం సీరియస్ మోడ్‌లో సాగుతుంది. సినిమాలో లాజిక్ లేకుండా కొన్ని సన్నివేశాలు ఉండటం మైనస్‌గా మారాయి. యామిని పాత్ర హీరోకు ఎందుకు సహాయం చేస్తుందో క్లారిటీగా చెప్పాల్సింది. పవిత్ర లోకేష్ సిగిరెట్ తాగడం, సోనియా అగర్వాల్ పేకాట ఆడటం ఎబ్బెట్టుగా అనిపించాయి. క్లైమాక్స్ మరింత ఎఫెక్టివ్‌గా ఉండాల్సింది. లవ్ ట్రాక్, కామెడీ పండలేదు.

విభిన్న పాత్రల్లో రామ్ చాలా ఎనర్జిటిక్‌గా నటించాడు. ముందే చెప్పుకున్నట్లు ఆ రెండు పాత్రల చుట్టే సినిమా ముందుకు సాగుతుంది. పోలీస్ ఆఫీసర్‌గా యామిని పాత్రలో నివేదా పెతురాజ్, మహిమ పాత్రలో మాళవిక శర్మ నటన ఫర్వాలేదు. మిగతా నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మణిశర్మ మరోసారి మ్యాజిక్ చేశాడు. నువ్వే నువ్వే పాటతో పాటు ఈ మూవీకి మంచి బీజీఎం అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. కొన్ని సన్నివేశాలు ఏదో తూతూమంత్రంగా తక్కువ ఖర్చుతో తీశారనిపించింది.

చివరగా తమిళ రీమేక్‌గా వచ్చిన ఈ మూవీని సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. కానీ కిషోర్ తిరుమల స్క్రీన్‌ప్లేతో పూర్తిగా ఎంగేజ్ కాలేం. సస్పెన్స్ థ్రిల్లర్లు గ్రిప్పింగ్‌గా ఉంటేనే మంచి విజయం సాధిస్తాయి. ట్విస్టులు ముందే తెలిసిపోతే కథలోకి లీనం కాలేం. అదే ఈ సినిమాలో మైనస్. రామ్ కోసం అయితే ఒక్కసారి ఈ సినిమాను తప్పనిసరిగా చూడొచ్చు.

A REVIEW WRITTEN BY NVLR
THEATER WATCHED: మిరాజ్ సినిమాస్ (చందానగర్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

-->