Breaking News

విజయ్ ‘మాస్టర్’ మూవీ రివ్యూ

2 0

VIJAY MASTER MOVIE REVIEW: ROUTINE MASS MASALA

రేటింగ్: 2.5/5

తమిళ అగ్రహీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఖైదీ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేష్ కనకరాజ్ ఈ మూవీకి దర్శకుడు. ఖైదీ సినిమాలో కథ, కథనాలకు ప్రాధాన్యమిస్తూ హీరోయిజాన్ని అండర్‌ప్లే చేసిన దర్శకుడు ఈ సినిమాలో మాత్రం కథనాన్ని గాలికొదిలేశాడు. విలన్ పాత్రపై ఉన్న శ్రద్ధ స్క్రీన్‌ప్లేపై కనిపించలేదనిపిస్తే అతిశయోక్తి కాదు.

కథ విషయానికొస్తే జేడీ (విజయ్) ఓ కాలేజీలో సైకాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తుంటాడు. కాలేజీ యాజమాన్యానికి అతడు అంటే పడదు కానీ విద్యార్థుల్లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. కానీ ఓ గొడవ కారణంగా సదరు కాలేజీని విడిచిపెట్టి జువైనల్ హోంలో మాస్టర్‌గా చేరతాడు. బాలనేరస్తులను అడ్డుపెట్టుకుని నేరాలు చేసే భవానీ (విజయ్ సేతుపతి)తో జేడీ కయ్యానికి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.

ఈ సినిమాలో మంచి కథ ఉంది. పాటలు మాస్‌ను అలరించేలా ఉన్నాయి. హీరో ఎలివేషన్, విలన్ పాత్ర బాగున్నాయి. ఎటొచ్చీ కథనం ఫ్లాట్‌గా ఉండటమే ఈ సినిమాకు మైనస్‌గా మారింది. తమిళ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చితే వింతేమీ లేదు కానీ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఓన్ చేసుకోలేరు. ఎందుకంటే విజయ్ అంటే తెలుగులో అంత ఫాలోయింగ్ లేదు. కమర్షియల్ ఎంటర్‌టైనర్లు తీయడానికి మన దగ్గర చాలామంది హీరోలు ఉన్నారు. తమిళ్ సినిమా అనగానే మనోళ్లు కథ, కథనాలపైనే ఎక్కువ దృష్టి సారిస్తారు. ఫస్టాఫ్ వరకు ఈ సినిమా బాగుంది అనిపించినా సెకండాఫ్ రొటీన్‌గా సాగడంతో ఈ మూవీ గ్రాఫ్ పడిపోయింది.

పాత్రల విషయానికొస్తే విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఊర మాస్ పాత్రలో అతడు బాగా నటించాడు. ఈ సినిమాలో విలన్ పాత్ర పెద్ద ఎస్సెట్. భవానీ పాత్ర ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది. అందులో విజయ్ సేతుపతి అదరగొట్టాడనే చెప్పాలి. హీరోయిన్ మాళవిక మోహన్ చూడటానికి బాగానే ఉంది. కానీ ఆమెకు సినిమాలో అంత స్కోప్ లేదు. అనిరుధ్ స్టార్ సినిమాకు కావాల్సిన మ్యూజిక్, బీజీఎం బాగా ఇచ్చాడు. డైలాగ్స్ తమిళం నుంచి తర్జుమా చేశారనిపించేలా ఉంది. తెలుగు వెర్షన్‌లో కొన్ని డైలాగులు మారిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా.. ఇటీవల వచ్చిన క్రాక్ సినిమాలోనూ మాస్ ఎలివేషన్స్ బాగున్నాయి. అది అచ్చ తెలుగు సినిమా కాబట్టి ఏదోలా పాస్ అయిపోయింది. కానీ తమిళం నుంచి అరువు వచ్చిన ఈ సినిమాలో కూడా మాస్ ఎలివేషన్స్ అలానే ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు కనెక్ట్ అవుతారు అనే దానిపై ఈ మూవీ సక్సెస్ ఆధారపడి ఉంది. రొటీన్ మాస్ మసాలా కోరుకునేవారికి ఈ సినిమా టైమ్ పాస్ అయిపోతుంది కానీ మిగిలిన వారి సంగతి కూడా దర్శకుడు పట్టించుకుంటే బాగుండేది. ఖైదీలో భావోద్వేగాలు పండగా ఈ సినిమాలో ఆ అంశమే మిస్ ఫైర్ అయింది.

A REVIEW WRITTEN BY NVLR

THEATER WATCHED: శివపార్వతి (కూకట్‌పల్లి)

-->