బంగారం కొనేవారు కాస్త ఆగండి. భవిష్యత్‌లో పసిడి ధరలు తగ్గే అవకాశాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రిప్టో కరెన్సీ వల్ల బులియన్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతోందని, బంగారంపై పెట్టుబడులు తగ్గే అవకాశాలు ఉండటంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.48వేలకు దిగువకు పడిపోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి ధర రూ.50వేలకు పైగానే ఉంది. అటు దేశంలో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 10 గ్రాములు స్వచ్ఛమైన బంగారం ధర రూ.297 పెరిగి రూ.48,946కు చేరింది. సోమవారం నాటి ట్రేడ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.48,649 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు పెరుగడమే దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరుగడానికి కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు. ఇక వెండి ధరలు కూడా మంగళవారం స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.1,404 పెరిగి 65,380కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.63,976 వద్ద ముగిసింది.